కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ (Congress Disciplinary Committee) ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో చిన్నారెడ్డితో పాటు ఇతర అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ప్రవర్తించే నాయకులపై కఠినంగా వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో, ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

