కలం, నాగర్ కర్నూల్: శ్రావణమాసంలో సామాన్యులకు చక్కెర చేదు రుచులు చూపిస్తోంది. రోజురోజుకు ధరలు (Sugar Price Hike) క్రమంగా పెరుగుతున్నాయి. వారం క్రితం 50 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధర ఇప్పుడు 70 రూపాయలకు చేరుకుంది. శ్రావణమాసం రావడంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చక్కెర ధరలు పెరగడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.
ప్రతి ఇంటిలో చక్కెర లేనిదే రోజు గడవదు. ఉదయం లేచిన వెంటనే చాయ్, కాఫీ, పాలు తాగడం నుండి పలు రకాల పిండివంటల్లో చక్కెర వాడకం సర్వసాధారణం. అయితే ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజలు కొనుక్కోవడానికి భయపడుతున్నారు. చక్కెర ధరలు కూడా బంగారమయ్యాయి అనుకుంటూ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా దుకాణాలు తమ షాపుల్లో ఉన్న పాత సరుకు కొత్త ధరలను పెంచుతూ విక్రయిస్తుండడంతో ప్రజలు వాపోతున్నారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
చక్కెర ధరలు ఇలా పెరగడానికి గల కారణాలు ప్రజలకు అంతు చిక్కడం లేదు. కిరాణా షాపుల్లో మాత్రం పైనుంచి తమకు చక్కెర దిగుమతులు రావడంలేదని పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో చక్కెర ధర ఇంకా పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో కొందరు కిలోల కొద్దిగా చక్కెరను కొనుగోలు చేస్తున్నారు. చక్కెర ధరలు ఇలాగే పెరిగితే హోటల్లలో టీ, కాఫీల ధరలు కూడా పెరుగుతాయేమోనని ఆందోళన కనిపిస్తోంది. ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో సిలిండర్ ధరలు పెరిగిన పరిస్థితులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి చక్కెర ధరను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

