కలం, స్పోర్ట్స్: గాలె టెస్టులో కులదీప్ యాదవ్ (Kuldeep Yadav) తక్కువ వికెట్లు తీసినా అతడి ప్రతిభపై టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పూర్తి నమ్మకం ఉందని స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పష్టం చేశారు. కొలంబోలో జరగబోయే రెండో టెస్టులో అతను జట్టు వ్యూహాల్లో కీలక భాగంగా ఉంటాడని వివరించారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ చెరో 7 వికెట్లతో మొత్తం 14 వికెట్లు పంచుకున్నారు. కులదీప్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ సాధించాడు.
కులదీప్ ఇప్పటికీ మ్యాచ్ విన్నరే..
ఈ మ్యాచ్‌పై కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడారు. గాలె పిచ్ పరిస్థితులు, కూకబుర్రా బంతి స్వభావం వలనే కులదీప్ వేరే పాత్ర పోషించాల్సి వచ్చిందని తెలిపారు. కులదీప్ ఇప్పటికీ మ్యాచ్ విన్నరేనని, అతను జట్టు ప్రణాళికల్లో కచ్చితంగా ఉన్నాడని చెప్పారు. కూకబుర్రా బంతి మెత్తగా మారినప్పుడు రిస్ట్ స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమవుతుందని వివరించారు. ఫింగర్ స్పిన్నర్లు బంతి వేగాన్ని, గ్రిప్ సులభంగా మార్చగలరని, కానీ రిస్ట్ స్పిన్నర్లకు సీమ్ కిందకు పోవడం వలన అది సాధ్యం కాదని అన్నారు.
ఒక్క మ్యాచ్‌తో అంచనా వేయలేం..
ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆటగాడి ప్రతిభను అంచనా వేయలేమని బహుతులే చెప్పారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించిందని పేర్కొన్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్లుగా కులదీప్ లైన్ అండ్ లెంగ్త్, బంతి వేగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడని గుర్తు చేశారు. జట్టు అప్పగించిన పాత్రను అతను బాధ్యతాయుతంగా నిర్వహించాడని ప్రశంసించారు.

