కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ పట్టణంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.45 కోట్ల నిధులను తీసుకువచ్చామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) తెలిపారు. వీరన్నపేటలోని హజ్రత్ హతావుల్లా షరీఫ్ మున్సి దర్గా వద్ద మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీగోడను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
గతంలో దర్గా వద్దకు వచ్చిన సమయంలో ప్రహరీగోడ నిర్మించాలని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించి ప్రహరీగోడ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని కబరస్తాన్లు, దర్గాలు, మసీదులు తదితర మైనారిటీ ప్రార్థనా స్థలాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మంజూరైన పనులను దశలవారీగా ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు.
హైలే అద్దీస్ ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయని, అలాగే రహిమానియా ఈద్గా వద్ద బౌండరీ వాల్ నిర్మాణం, రాక్ కటింగ్, బ్యూటిఫికేషన్ తదితర పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులు సుమారు 75 శాతం పూర్తయ్యాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జామియా మసీదు వద్ద అండర్‌గ్రౌండ్, సెల్లార్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, మదీనా మసీదు వద్ద ఎక్స్‌టెన్షన్, అదనపు గదుల నిర్మాణానికి ఎస్టిమేషన్లు సిద్ధం చేశామని, ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
తన పదవీకాలంలో మంజూరైన ప్రతి పనిని గ్రౌండ్ చేసి, పూర్తిచేసే బాధ్యతను తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో మైనారిటీ ప్రార్థనా స్థలాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అంతకుముందు ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ప్రతినిధులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్ సయ్యద్ మోసిన్, నాయకులు ఖాజా పాషా, సాదుల్లా, అబ్దుల్ హక్, రిజవాన్ సాయబ్, మౌనుద్దీన్ రఫీ, ఇర్ఫాన్ అమేర్, నసీర్, తదితరులు పాల్గొన్నారు.

