కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) జిల్లా ఎల్కతుర్తి (Elkathurthy) మండలంలో శుక్రవారం ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ప్రధాన రహదారి పక్కన రెండు రోజులుగా అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన అద్దె కారులో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం కలకలం రేపింది. కారులో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని కారు డిక్కీని తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనిపించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు గోదావరిఖనికి చెందిన మహిళగా గుర్తించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
వివాహేతర సంబంధమే కారణమా?
కాగా, ఎల్కతుర్తి(Elkathurthy)కి చెందిన ఓ వ్యక్తికి మృతురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మహిళను హత్య చేసి కారులోని డిక్కీలో మృతదేహాన్ని పెట్టి ఉండవచ్చనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Also Read : ఆకస్మిక తనిఖీ.. టాయ్‌లెట్స్ కడిగిన మంత్రి జూపల్లి
Follow Us On : WhatsApp

