కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ (Inter Education Department) లో శాంక్షన్ పోస్టుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు లేవంటున్న అధికారులు.. తాజాగా గెస్ట్ లెక్చరర్లను శాంక్షన్ పోస్టులుగా చూపడం పలు ప్రశ్నలను లేవనెత్తింది. 20 నుంచి 26 ఏళ్ల సర్వీసు ఉన్న ఒప్పంద అధ్యాపకుల కంటే రెండేళ్ల కింద విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లకు కల్పించడమేంటనే అనుమానాలు వస్తున్నాయి.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన జీవో 1422లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులను నాన్ శాంక్షన్ పోస్టులుగా పేర్కొన్నారు. ఆ మేరకు విధులు కొనసాగించేందుకు రెన్యూవల్ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన జీవో 1460లో పరిస్థితి మారిందని ఒప్పంద అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. సుమారు 892 గెస్ట్ అధ్యాపకుల పోస్టులను శాంక్షన్ పోస్టులుగా చూపించగా, ఒకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టులను మాత్రం నాన్ శాంక్షన్‌గా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే వ్యవస్థలో ఏడాది వ్యవధిలో పోస్టుల స్వరూపం ఎందుకు మారిందో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
20 ఏళ్లకుపై సేవలకు విలువ లేదా?
ఒప్పంద అధ్యాపకుల్లో చాలామంది 20 నుంచి 26 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద అధ్యాపకులు కూడా ఉన్నారు. కుటుంబ బాధ్యతలను మోస్తూ, ఉద్యోగ భద్రత లేకుండా ఇన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు శాంక్షన్ పోస్టులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఒప్పంద అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు దీర్ఘకాలిక సేవ.. మరోవైపు ఇటీవలే చేరిన గెస్ట్ అధ్యాపకులకు శాంక్షన్ పోస్టుల మధ్య వ్యత్యాసానికి కారణమేంటో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
892 పోస్టుల వెనుక అసలు కథేంటి?
ఒకేసారి సుమారు 892 పోస్టులను శాంక్షన్డ్ గా చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాతిపదికన అయ్యాయి? వాటి ప్రతిపాదనలు ఎప్పుడు పంపారు? ఏ నిబంధనల ఆధారంగా ఆమోదించారు? అనే విషయాలను ఇంటర్ విద్యాశాఖ బహిర్గతం చేయాలని ఒప్పంద అధ్యాపకులు కోరుతున్నారు. మరోవైపు గెస్ట్ అధ్యాపకులకు మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కల్పించే ప్రక్రియ వెనుక పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన ప్రచారం జరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే.. అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నారు.
క్రమబద్ధీకరణపైనా ఆరోపణలు
2023లో జరిగిన ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియపైనా కొన్నివర్గాల నుంచి ఆరోపణలు వచ్చినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. శాంక్షన్ పోస్టుల్లోని అర్హులను పక్కనపెట్టి, సీనియారిటీ పేరుతో కొందరికి ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. అప్పటి ప్రక్రియపై కూడా పూర్తిస్థాయి పరిశీలన జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త శాంక్షన్ పోస్టులు అందుబాటులోకి వస్తే ముందుగా దీర్ఘకాల ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒకేషనల్ విద్యలో 19 నుంచి 26 ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులకు కేటాయించి అర్హత, సర్వీసు, అనుభవం ఆధారంగా భవిష్యత్తుపై భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోస్టుల ‘మాయాజాలం’పై విచారణ జరగాలి :
ఇంటర్ విద్యాశాఖలో శాంక్షన్ పోస్టుల విషయంలో గతేడాది, ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాల మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని అధ్యాపకవర్గాలు అంటున్నాయి. పోస్టుల కేటాయింపులో పారదర్శకత లేకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులకు కొత్త అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 26 ఏళ్లుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నమ్ముకుని పనిచేస్తున్న తమకు ముందుగా న్యాయం చేయాలని, శాంక్షన్ పోస్టుల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ఒప్పంద అధ్యాపకులు సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు. సీఎం స్వయంగా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించి, అక్కడి అధ్యాపకుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వనపర్తి కాలేజీలో విచిత్రం..
సీఎం రేవంత్‌రెడ్డి చదివిన వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో దాదాపు 19 ఏళ్లుగా పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు శాంక్షన్ పోస్టులు లేవని అధికారులు చెబుతున్నారని అంటున్నారు. రెండేళ్ల కింద విధుల్లో చేరిన గెస్ట్ అధ్యాపకులు శాంక్షన్ పోస్టుల్లో ఉన్నట్లు పేర్కొనడం తమను మరింత ఆవేదనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చదివిన కాలేజీలోనే బోధించిన గురువులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరమని అంటున్నారు.

