కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల డ్యాం (Jurala Dam) పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ధరూర్ ఎస్ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ కు చెందిన గణేష్ (23), మల్లేపల్లికి చెందిన శివకుమార్ (24), పెద్దాయపల్లికి చెందిన శ్రీకాంత్ ముగ్గురు కలిసి బుధవారం జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
ఒకే బైక్ పై ముగ్గురు జూరాల పరిసర ప్రాంతాలను చూసి బుధవారం రాత్రి జూరాల డ్యాం రోడ్డు మీదుగా గద్వాల వైపు బయలుదేరారు. వేగంగా వస్తున్న బైక్ డ్యాం రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో బైక్ స్పీడ్ బ్రేకర్ మీద నుంచి గాలిలోకి ఎగిరిపడింది. ఈ మేరకు 25 మీటర్ల మేర జూరాల విద్యుత్ ఉత్పత్తి పాయింట్ వరకు బైక్ వాళ్లను ఈడ్చుకుంటూ వెళ్లింది.
ఈ ప్రమాదంలో గణేష్, శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పెద్దాయపల్లికి చెందిన శ్రీకాంత్ గాయపడ్డాడు. జూరాల ప్రాజెక్టు రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా ఉండటంతో పాటు, రాత్రి వేళ కావడం వల్ల బైక్ నడుపుతున్న వ్యక్తి దానిని గమనించలేదు. దాంతో బైక్ అదుపుతప్పి తీవ్ర వేగంతో కిందపడింది. గమనించిన స్థానికులు గాయపడిన వారిని గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గణేష్ , శివకుమార్ లను మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి తరలించగా, శ్రీకాంత్‌ను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ లో చికిత్స పొందుతున్న గణేష్ , శివకుమార్ లు గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందీకర్ తెలిపారు. ప్రమాదానికి స్పీడ్ బ్రేకర్లే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రాణాలు తీసిన స్పీడ్ బ్రేకర్
బుధవారం రాత్రి జూరాల డ్యాం రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్లే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు వంతెనపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక రంగులు కానీ, రేడియం స్టిక్కర్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో దగ్గరకు వచ్చేదాకా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్న విషయం తెలియడం లేదు.
దీంతో వేగంగా వచ్చే వాహనాలు హఠాత్తుగా వేగం తగ్గిస్తుండగా, వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించి చిన్నగా నియంత్రికలను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

