రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ.. కారణం ఇదే!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలలో సెక్షన్ 22A (నిషేధిత జాబితా) దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao).. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నిజాంపేట్ వంటి ప్రముఖ ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎమ్‌డీఏ (HMDA), జీహెచ్‌ఎమ్‌సీ (GHMC) అనుమతులు పొందిన వేలాది ప్రైవేటు ఆస్తులను, పట్టా భూములను నిబంధనలకు విరుద్ధంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి వేధింపులకు గురిచేస్తున్నారని హరీష్ రావు (Harish Rao) లేఖలో పేర్కొన్నారు. గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) కింద క్రమబద్ధీకరించబడిన ఆస్తులపై కూడా మళ్లీ వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు.

ఈ నిషేధిత జాబితా పేరుతో రెవెన్యూ శాఖలో ఏకంగా 30 శాతం వసూళ్ల దందా సాగుతోందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. నిషేధిత జాబితా నుండి భూములు, ఆస్తులను తొలగించడానికి (de-notification) దళారులు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, ప్రైవేటు ఆస్తుల యజమానులను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంపై స్వతంత్ర, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కోరారు. అక్రమాలకు గురైన బాధితులకు సరైన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>