కలం, వెబ్‌డెస్క్: కేరళ (Kerala) లోని అలప్పుజలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ఐఫోన్ (iPhone) కోసం తన తాతను చంపించింది. ఈ హత్య కోసం తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరి సహాయం తీసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు తన 13 ఏళ్ల మనవరాలితో కలిసి అలప్పుజలో ఉంటున్నాడు. మనవరాలు ఓ యువకుడితో ప్రేమలో ఉంది. తనకు ఐ ఫోన్, తన బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనాలని ఇద్దరు అనుకున్నారు. దీని కోసం ఇంట్లో ఉన్న బంగారం చోరీ చేసి అమ్మాలని నిర్ణయించుకున్నారు. బాయ్‌ఫ్రెండ్ స్నేహితులతో కలిసి దొంగతనానికి స్కెచ్ వేశారు. అదే సమయంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడని, అతడ్ని చంపేయాలని బాయ్‌ఫ్రెండ్‌కు సూచించింది.
దీంతో పథకం ప్రకారం బాయ్‌ఫ్రెండ్‌ని, అతడి స్నేహితులను ఇంటికి రమ్మని చెప్పింది. వెంటిలేటర్ ద్వారా ఇద్దరు యువకులు, మెయిన్ డోర్ ద్వారా మరొకరు ఇంట్లోకి వెళ్లి వృద్ధుడిని కట్టేసి కొట్టి హత్య చేశారు. హత్య చేసేటప్పుడు బాలికకు వీడియో కాల్ చేసి చూపించారు. హత్య అనంతరం పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. హత్యకు పాల్పడ్డ యువకుల కోసం గాలిస్తున్నారు.

