జాతీయ యోగాలో విజేతలుగా నిలవండి: ఎమ్మెల్యే గంగుల

కలం, కరీంనగర్ బ్యూరో: యోగాకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలో విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ (Karimnagar Yoga) ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి యోగా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. మన సంస్కృతికి చిహ్నమైన యోగా నేడు ప్రపంచంలో 160 దేశాల్లో ప్రాతినిధ్య వహించడం సంతోషదాయకమన్నారు.

‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’ అన్న చందంగా చిన్న వయసు నుండి యోగాలో శిక్షణ పొందితే విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తనలాంటి వారికి యోగా చేయాలన్నా ఆసక్తి ఉన్న అది పూర్తిస్థాయిలో నెరవేరదని, అందుకే విద్యార్థులు అందరూ బాల్యం నుండే యోగాలో ప్రవేశం పొందాలన్నారు. యోగాలో భాగస్వాములు అయితే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు.

రానున్న రోజుల్లో అవగాహన కార్యక్రమాలు..

ప్రతి ఇంటిలో యోగ అభ్యసన తప్పనిసరి అని అందుకోసం రానున్న రోజుల్లో ఆర్ట్స్ కళాశాల మైదానంలో యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ లో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల విజయవంత నిర్వహణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగాలో కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానమని, ఇక్కడి నుండి సిద్ధారెడ్డి, ప్రణీత, యమునా వంటివారు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారన్నారు. ఈ క్రీడలో రాణించాలన్న ప్రాథమికంగా యోగా శిక్షణ తప్పనిసరి అన్నారు.

అన్ని క్రీడలకు మూలమైన యోగాతో మానసిక దృఢ సంకల్పంతో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలరన్నారు. కలాం చెప్పినట్లుగా లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని.. ప్రతి క్రీడాకారుడు స్వర్ణ పతకమే లక్ష్యంగా సాధన చేయాలన్నారు. అమ్మ చేతి వంట అమృతం అని.. మార్కెట్ లో లభించే కల్తీ ఆహారాలకు క్రీడాకారులు దూరంగా నిలవాలని సూచించారు.

గత మూడు దశాబ్దాలుగా ఛాంపియన్‌..

రాష్ట్ర యోగ అసోసియేషన్ చైర్మన్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుండడం సంతోషదాయకమని చెప్పారు. ప్రతిభగల క్రీడాకారులు ప్రోత్సహించడంలో తమ అసోసియేషన్ ముందుంటుందన్నారు. ప్రత్యేకంగా క్రమం తప్పకుండా అసోసియేషన్ ఆధ్వర్యంలో చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా జాతీయ యోగ పోటీలు కరీంనగర్ లో నిర్వహించేలా ఎమ్మెల్యే గంగుల చొరవ తీసుకోవాలని కోరారు. ఈ పోటీల నిర్వహణతో జాతీయ క్రీడా పటంలో కరీంనగర్ కు ప్రత్యేక స్థానం లభిస్తుందన్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు వివిధ కేటగిరిలో పాల్గొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపాల్ కే శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్లు చల్లా హరి శంకర్, ఎడ్ల అశోక్, మైఖేల్ శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోశాధికారి పి. స్వరూప చారి, ఎం వికాస్ యోగా కోచులు వి.కిష్టయ్య, పి మల్లిక, ఆనంద కిషోర్, వీణ వాణి, రాజమౌళి, శైలజ, ప్రవళిక, కె రాజశేఖర్, బి అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>