కలం, భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల పాలనలో కాల్వల అభివృద్ధికి రూపాయి కూడా విదల్చని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. భువనగిరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దుష్ప్రచారాలపై ఆగ్రహం
బీఆర్ఎస్ నాయకులను “కళ్లుండి చూడలేని కబోదులు” అని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వారికి కనిపిస్తున్నా, కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, బస్వాపూర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మీడియా సమక్షంలో నేరుగా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులకు ధైర్యముంటే చర్చకు రావలసిందిగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీఆర్ఎస్కు డిపాజిట్లు దక్కవు
బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, కానీ ప్రజా ప్రభుత్వం బి.ఎన్. తిమ్మాపురం ముంపు బాధితుల కష్టాలను గుర్తించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ. 206 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. నిర్వాసితుల పట్ల ప్రత్యేక ఉదారత చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ. 200 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుందని వెల్లడించారు.
మూసీ మురుగు నీటిపై ఆధారపడే అవసరం లేకుండా గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బస్వాపూర్ రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కెనాల్ ನೀరు దిగువ ప్రాంతాలకు సరఫరా అయ్యేందుకు జాతీయ రహదారిని కటింగ్ చేసి కాల్వ నిర్మాణ పనులు చేపడుతున్నామని, బునియాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

