కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా ధరూర్ (Dharoor) మండలం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న 90 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో (మిషన్ భగీరథ గ్రిడ్) వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల (Mission Bhagiratha Workers) కు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బుధవారం సమ్మెకు పూనుకున్నారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ గ్రిడ్‌లో ఐహెచ్పీ, ఎక్సలైంట్, మెగా కంపెనీలకు చెందిన లైన్ మెన్, ఫిటర్స్, బ్యాక్ వాష్ ఆపరేటర్స్ గా పని చేస్తున్నారు. ఇందులో ఐహెచ్పీ, ఎక్సలెంట్ కంపెనీలకు చెందిన సుమారు 200 మంది కార్మికులకు గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు.
మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కార్మికులకు 8 నెలలుగా వేతనాలు అందడం లేదు అని, కార్మికులకు ప్రతినెల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిబంధన విధించినప్పటికీ ఐహెచ్పీ, ఎక్సలెంట్ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు అవేవి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీటిని అందించే తమ కుటుంబాలు గడవక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించేలా కాంట్రాక్టర్లను ఆదేశించాలని కార్మికులు కోరుతున్నారు.

