వనపర్తి ‘హస్తం’లో మంటలు.. బీఆర్ఎస్‌కు బిగ్ ఛాన్స్..!

కలం, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్‌ (Wanaparthy Congress) లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం కావడంతో జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు వనపర్తి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయన్న చర్చ సాగుతోంది.

ఒకవైపు సీనియర్‌ నేత.. మరోవైపు ఎమ్మెల్యే నాయకత్వం ఉండగ.. మధ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ప్రధాన చర్చగా మారింది. వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ సొంత పార్టీ లోనే నాయకులు ప్రతిపక్ష పార్టీ మాదిరిగా విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు చేసుకోవడంతో భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నాత్మకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్ఎస్ కు కలిసొస్తున్న పరిణామాలా?

కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ వర్గపోరు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి (Singireddy Niranjan Reddy) రాజకీయంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ రాజకీయాలను సుదీర్ఘకాలంగా గమనిస్తున్న నిరంజన్‌రెడ్డి రాజకీయ చాతుర్యం, తన క్యాడర్‌తో ఉన్న అనుబంధాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్‌లోని విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ కు గ్రాఫ్ పెంచే అవకాశాలు లేకపోలేదు. అయితే కాంగ్రెస్‌లోని అంతర్గత సమస్యలు ఎంతవరకు బీఆర్‌ఎస్‌కు ఓటు బదిలీగా మారతాయన్నది ఇప్పుడే చెప్పలేం. కార్యకర్తల అసంతృప్తి ఎన్నికల సమయానికి ఏ రూపం దాల్చుతుందన్నదే కీలకం.

చిన్నారెడ్డికి సీనియారిటీ.. కానీ క్యాడర్‌ బలం ఎంత?

చిన్నారెడ్డికి నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ రాజకీయాలతో అనుబంధం ఉంది. మంత్రి పదవి నుంచి రాష్ట్రస్థాయి కీలక బాధ్యతల వరకు ఎదిగిన ఆయనకు పార్టీలో సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు ఉంది. అయితే నియోజకవర్గ రాజకీయాల్లో సీనియారిటీకి తోడు బలమైన కార్యకర్తల నెట్‌వర్క్‌ కూడా అవసరం. ఇప్పుడు చిన్నారెడ్డి ముందున్న అసలు పరీక్ష ఇదేనన్న చర్చ జరుగుతోంది. తనతో ఉన్న సీనియర్‌ నాయకులు, కార్యకర్తలకు ఆయనను నమ్ముకున వారికి ఏ మేరకు ‘అభయ హస్తం’ అందిస్తారు? వారిని మళ్లీ తనవైపు సమీకరించగలరా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

‘కాంగ్రెస్‌కు సంబంధం లేని వ్యక్తికి టికెట్‌’ అన్న వ్యాఖ్యలపై చర్చ..

2023 ఎన్నికల సమయంలో తనకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో మరో చర్చకు దారితీశాయి. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు, కార్యకర్తల నుంచి మరో వాదన వినిపిస్తోంది. సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను తనవైపు పూర్తిస్థాయిలో సమీకరించడంలో చిన్నారెడ్డి విఫలమయ్యారా? అన్న ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.

టికెట్‌ వ్యవహారంపై అసంతృప్తి ఒక అంశమైతే.. ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను ఎంతవరకు తనతో కలుపుకొచ్చారన్నది మరో అంశంగా మారింది. ‘ఆర్థికంగా అండగా నిలవలేదు’ అన్న కార్యకర్తల వాదన మరోవైపు. కొందరు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మాత్రం తమకు చిన్నారెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సహకారం అందలేదని పేర్కొంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎన్నికల రాజకీయాల్లో కార్యకర్తల వ్యక్తిగత అవసరాలు, తగిన సహకారం, స్థానిక నాయకత్వంతో నిరంతర సంబంధాలు వారి కష్టాలను పట్టించుకోవడం, కార్యకర్తల ఆర్థిక పురోగతికి అవకాశాలు కల్పించడం కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి కొంతమంది నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మాత్రమే. మొత్తం కాంగ్రెస్‌ క్యాడర్‌ ఇదే అభిప్రాయంతో ఉందని చెప్పలేం. ఇదే సమయంలో చిన్నారెడ్డి అనుచరులు మాత్రం ఆయన సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేశారని, డబ్బుల కోసం కాకుండా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందని చెబుతున్నారు.

మేఘారెడ్డి ముందున్న సవాల్‌ కూడా చిన్నది కాదు

మరోవైపు ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల్లో తన బలాన్ని పెంచుకోవడంతో పాటు కాంగ్రెస్‌లోని పాత, కొత్త నాయకత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అభివృద్ధి పనులు ఒకవైపు.. పార్టీ ఐక్యత మరోవైపు అనే పరిస్థితిలో మేఘారెడ్డి తన నాయకత్వాన్ని ఎంత సమర్థవంతంగా నిరూపించుకుంటారన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొంతమందికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీలు మారిన వలసవాదులకు అవకాశాలు ఇస్తున్నారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదన కూడా స్థానికంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే వర్గం మాత్రం ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల ద్వారా క్యాడర్‌ను తనతో కలుపుకుంటున్నామని చెబుతోంది.

‘పెద్దమనిషి’గా చిన్నారెడ్డి పాత్రపై చర్చ

కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడిగా చిన్నారెడ్డికి మరో కీలక బాధ్యత కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి పార్టీలోని నాయకుల మధ్య విభేదాలను తొలగిస్తూ సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తల మధ్య సమన్వయం చేయగలిగితే ఆయనకు రాజకీయంగా ఎదురేలేదని ఆయనకు మరింత గౌరవం లభించే అవకాశం ఉందనీ చెబుతున్నారు. అదే సమయంలో తనపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో వెనుకడుగు వేయకూడదన్నది ఆయన అనుచరుల వాదన.

వనపర్తి కాంగ్రెస్‌కు అసలు పరీక్ష

వనపర్తిలో కాంగ్రెస్‌(Wanaparthy Congress)కు ఉన్న సుదీర్ఘ చరిత్ర, బలమైన క్యాడర్‌ నేపథ్యంలో ప్రస్తుత విభేదాలను పార్టీ అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందన్నదే కీలకం. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇద్దరు నాయకులు బహిరంగంగా విమర్శలు చేసుకునే పరిస్థితి కొనసాగితే దాని ప్రభావం కింది స్థాయి కార్యకర్తలపై పడే అవకాశం ఉంది. నాయకుల మధ్య సమన్వయ లోపంతో ఎవరి పట్టు కోసం వారు ఆధిపత్యం కోసం తపన పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలను వారి ఆర్థిక స్థితిగతులను, కష్టనష్టాలను పట్టించుకునేవారు లేరనే భావన కార్యకర్తల్లో విముఖత కనిపిస్తుంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఈ పరిణామాలను తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

చిన్నారెడ్డి – మేఘారెడ్డి మధ్య విభేదాలకు ముగింపు ఎప్పుడు?

ప్రస్తుతం వనపర్తి కాంగ్రెస్‌ (Wanaparthy Congress) ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. సీనియర్‌ నేతను గౌరవిస్తూ ఎమ్మెల్యేకు పూర్తి రాజకీయ స్వేచ్ఛ ఇస్తారా? లేక ఇద్దరి మధ్య అధికారిక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారా? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అన్నది అధిష్ఠానం నిర్ణయించాల్సి ఉంది. అధిష్ఠానం సమన్వయంతో అగ్ర నాయకులు ఒకటైతే.. విమర్శలు చేసుకుంటున్న నాయకులు, కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకుంటున్న వర్గవిభేదాల సంగతేంటి..? అనే చర్చ నడుస్తోంది.

మరోవైపు చిన్నారెడ్డి తన సీనియారిటీని క్యాడర్‌ బలంగా మార్చుకోగలరా? మేఘారెడ్డి తన ఎమ్మెల్యే పదవిని పార్టీ బలంగా మలుచుకోగలరా? కాంగ్రెస్‌లోని అసంతృప్తిని ప్రస్తుత పరిణామాలను బీఆర్ఎస్ రాజకీయ బలంగా మార్చుకోగలదా..? వనపర్తి రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూనే చర్చ సాగుతోంది.

‘హస్తం’లో రగులుతున్న వర్గపోరు ఎవరికి నష్టం చేస్తుంది? ఎవరికి లాభం చేకూరుస్తుంది? చిన్నారెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, సీనియారిటీని నిలబెట్టుకునేందుకు ఎంతవరకు పోరాడతారు? మేఘారెడ్డి తన ఎమ్మెల్యే పదవిని ఆధారంగా చేసుకుని పార్టీపై పూర్తి పట్టు సాధించగలరా? అధిష్ఠానం ఇద్దరి మధ్య రాజీ కుదురుస్తుందా? లేక క్రమశిక్షణ చర్యలకు వెళ్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే వనపర్తి కాంగ్రెస్‌ భవిష్యత్‌ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక్క విషయం స్పష్టం—వనపర్తి కాంగ్రెస్‌లో మంటలు ఆరిపోలేదనే తెలుస్తోంది. అవి మరింత ఎగిసిపడుతున్నాయా.. లేక అధిష్ఠానం జోక్యంతో చల్లారుతున్నాయా అన్నది వేచి చూడాల్సిందే. రానున్న రాజకీయ పరిణామాలే తేల్చనున్నాయి.

Also Read : ఝలక్ ఇస్తారా.. సర్దుకుపోతారా : రాజగోపాల్ రెడ్డి డుమ్మాల వెనుక అసలు కథ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>