కలం, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao)కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఓ మహిళ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేగా కాంతారావుపై అత్యాచార కేసు నమోదైంది. రేగా కాంతా రావు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గత బుధవారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ సమయంలో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
మరోవైపు కోర్టు తీర్పుపై రేగా కాంతా రావు (Rega Kantha Rao) స్పందించారు. తనను పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు. తనపై దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హై కోర్టులో న్యాయ పోరాటం చేశానని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు వ్యవహరించారని ఆరోపించారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ తాను అరెస్టు అయినట్లుగా వార్తలు రాయించారన్నారు. తనపై నమోదైంది తప్పుడు కేసు అని తేలడంతో హైకోర్టు ఆ కేసును కొట్టివేసిందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

