కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ తాడోబా-అంధేరీ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలో ఒక పెద్దపులి (Chandrapur Tiger) ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. జారీ బఫర్ గేట్ పరిధిలోని ప్రధాన రహదారిపైకి వచ్చిన ఒక మగపులి, కొంతసేపు ఎంతో దర్జాగా నడుచుకుంటూ వెళ్ళింది. అటవీ ప్రాంతం గుండా వెళ్లే రోడ్డుపై పులి స్వేచ్ఛగా సంచరించడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
రహదారిపై వాహనాలు నిలిచిపోయినప్పటికీ, పులి ఏమాత్రం భయపడకుండా తనదైన శైలిలో నడుచుకుంటూ ముందుకు సాగింది. ఈ అరుదైన దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు, ప్రయాణికులు తమ ఫోన్ల కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ప్రజలు అటవీ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు దిగవద్దని హెచ్చరించారు.

