కలం, వెబ్ డెస్క్ : నర్సంపేట(Narsampet) లో దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నేడు నర్సంపేట బంద్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. విగ్రహ తొలగింపు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా నేడు నర్సంపేట బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
దివంగత నేత పెద్ది సుదర్శన్ నరెడ్డి విగ్రహ ఏర్పాటుపై ముందుగానే కలెక్టర్, సీపీకి సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ ఎలంటి నోటీసులు ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని ఎర్రబెల్లి మండిపడ్డారు. భూ యజమాని అనుమతితోనే ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించకపోతే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

