కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ (Rampoor)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి. శ్రీహిత (Srihitha) జాతీయ స్థాయి అంతరిక్ష కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల కేజీఎఫ్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ జేసీ మనోజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీహిత ప్రతిభను గుర్తించి, ఆమెను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ ట్రస్ట్ తరఫున రూ.10,000 నగదు చెక్‌ను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జేసీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమన్నారు. “ప్రతిభను గుర్తించడం మాత్రమే కాదు.. ప్రోత్సహించి సరైన అవకాశాలు కల్పించడం కూడా సమాజం బాధ్యత” అని అన్నారు. శ్రీహితను ప్రోత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగా సావిత్రి, మార్గదర్శక ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులను ఈ సందర్భంగా కేజీఎఫ్ ట్రస్ట్ అభినందించింది.
ఈ కార్యక్రమంలో కేజీఎఫ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాగేందర్ పాల్గొని శ్రీహితను అభినందించారు. అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, ఉపగ్రహ సాంకేతికత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే జాతీయ స్థాయి కార్యక్రమానికి శ్రీహిత ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.

