దేవరకొండలో విద్యార్థినుల నిరసన.. లెక్చరర్‌పై దాడి?

కలం, దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండలోని(Devarakonda) ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో(Govt Girls Junior College) మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాలలో పనిచేస్తున్న తెలుగు లెక్చరర్ భాస్కర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. లెక్చరర్‌ను వెంటనే సస్పెండ్ చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వారికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థినులతో కలిసి కళాశాల గేటు ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు.. లెక్చరర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై పదేపదే వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ధర్నా కొనసాగుతున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు విద్యార్థులు లెక్చరర్ భాస్కర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థినుల భవిష్యత్తు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని బాధిత విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, విచారణ అనంతరం తప్పు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>