కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోపిడికి వత్తాసు పలికే మంత్రులకు చిత్తశుద్ది, చీము నెత్తురు ఉంటే పథకాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రిని కుర్చీ దించాలని బీఆర్ఎస్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కళ్యాణలక్ష్మిపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మంగళవారం మంథనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా రాజగృహా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బారీ ర్యాలీగా వచ్చి, మహిళలు చౌరస్తాలో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చేతులకు మట్టి అంటకుండా ప్రజలను ఏ విదంగా మోసం చేయాలని చూస్తుందో అర్థం అవుతుందన్నారు. ప్రజాపాలన పేరుతో కొత్త పాలనకు తెరలేపిన కాంగ్రెస్ తమకు సంబంధం లేనట్లుగానే కోర్టుల ద్వారానే పథకాలు ఆగిపోతున్నయని కొత్త తరహాలో మోసం చేస్తున్నారని ఆయన వివరించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వం, పాలనలో దాడులు, కేసులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్దికి నోచుకోని ఈ రాష్ట్రంలో మనం ఉండటం దౌర్భగ్యాంగా బావిస్తున్నట్లు చెప్పారు.
మంథని నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచి 40ఏండ్లుగా ప్రజలను వంచిస్తున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేయాలనేది చూపించిన చరిత్రను చూస్తున్నామని అన్నారు. ‘మా నాయన చదువుకున్న వాడు. అనుభవం ఉంది. స్పీకర్‌గా పని చేసిండు. మేం దేవుడికి, భక్తుడికి అనుసంధానం తప్ప.. మోసం చేయని కులం మాది’ అని చెప్పుకుంటూనే నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం సరిపోదని యావత్తు రాష్ట్ర ప్రజలు మోసం చేయాలని 420 హమీలు రాసిన చరిత్ర మంథని ఎమ్మెల్యేదని విమర్శించారు. 420హమీల అమలుపై ఎన్ని సార్లు ప్రశ్నించినా ఇప్పటి వరకు జవాబు చెప్పడం లేదన్నారు.
420 హమీలకు శ్రీధర్ బాబు జవాబు చెప్పాలి..
ఆనాడు ఆడబిడ్డల వద్దకు వెళ్లాడని, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని హమీ ఇచ్చాడని.. కానీ ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వలేదని వాపోయారు. చదువుకున్న విజ్ఞానవంతుడివైతే 420 హమీలకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లు దగ్గర పడుతున్నా రాష్ట్రంలో ఒక్క పథకం కొత్తవి అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టడానికి కోర్టులో కేసులు వేయిస్తున్నారని, కేసులకు కౌంటర్లు కూడా వేయడం లేదన్నారు.
నోటుకు నోటు కేసులో మాత్రం కోట్లు పెట్టి వకీళ్లను పెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజలకు సంబంధించిన పథకాలను అమలు చేయవద్దని చెప్పితే దానికి మాత్రం వకీళ్లను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. వాళ్లే కేసులు వేయిస్తూ పథకాలు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ది అంటే కాంగ్రెస్‌ది దోచుకోవడం, దాచుకోవడమని అర్థమన్నారు. ముఖ్యమంత్రి దోచుకోవడంలో మంత్రివర్గం ప్రముఖ పాత్ర పోసిస్తుందని, పథకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి వద్ద పైసలు లేవు కానీ.. జూబ్లీ హిల్స్‌లో రూ.200కోట్లతో ప్యాలెస్, ఫోర్త్ సిటీ పేరు మీద రూ.200 కోట్లతో భవనం కడుతున్నాడని విమర్శించారు. మనమడు పుట్‌బాల్ ఆడటానికి రూ.20 కోట్లుతో గ్రౌండ్, మరో రూ.20 కోట్లతో స్మిమ్మింగ్‌పూల్ కట్టిస్తున్నాడని, వీటన్నిటిపై మంత్రులు ఎందుకు నోరు మెదుపడం లేదన్నారు.
420 హామీలు రాసిన సన్నాసి ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం ఏది? అని పుట్ట మధు ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఊకదంపుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసులు పెట్టించడం ఆపి పథకాలు అమలు చేయాలని ఆయన హితవు పలికారు. ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి పేగు బంధమని, అందుకే ఆనాడు కేసీఆర్ కళ్యాణలక్ష్మి, దళితబంధు లాంటి పథకాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవమే కళ్యాణలక్ష్మి: శ్రీహర్షిణీ రాకేష్
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థికభరోసాకు నిలువెత్తు నిదర్శనంగా కళ్యాణలక్ష్మి పథకమని భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మానీఫెస్టోలో ఈ పథకం లేదని ఆమె వివరించారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఓ లంబాడి తండాకు వెళ్లిన సమయంలో అక్కడ ఓ తండ్రి తన బిడ్డ పెండ్లి కోసం దాచిన డబ్బులు అగ్నికి ఆహుతి అయ్యాయని, ఆ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి ఏ తల్లిదండ్రులకు బాధ పడకూడదని గొప్పగా ఆలోచన చేసి కళ్యాణలక్ష్మి పథకం తీసుకువచ్చారన్నారు.
ప్రభుత్వం ద్వారా రూ.51వేలతో ఆర్థికసాయం మొదలై రూ.1లక్షకు పెంచారని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డ పెండ్లిన అయిన వెంటనే కళ్యాణ లక్ష్మిచెక్కులు వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్కులు మంజూరీ చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఇటీవల రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఓ ఆడబిడ్డ బిడ్డను ఎత్తుకుని వచ్చి చెక్కు తీసుకెళ్లిందని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో మానీఫెస్టో రాసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పాడని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం ఎగ్గొట్టి ఈనాడు రూ.లక్ష సైతం ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకంపై కోర్టులో స్టే ఇచ్చే వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వం తీరుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ వాళ్ల దొంగపనులకు లాయర్లు ఉంటరు కానీ ప్రజల పథకాలను కొనసాగించేందుకు కేసులకు కౌంటర్ దాఖలు చేయడానికి లాయర్లు ఉండరని ఆమె విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ నిధులు విడుదల చేసే వరకు మహిళా లోకం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
పథకాలు రద్దు చేసే ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలి: పుట్ట శైలజ
ఆనాడు పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారని మంథని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. అలాంటి గొప్ప పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కలలను చెరిపేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మిలాంటి గొప్ప పథకాన్ని నెమ్మదిగా రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆమె అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంపై చేసే పోరాటంలో ప్రతి పేదింటి బిడ్డ బాగస్వాములై తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదింటి ఆడబిడ్డల కోసం మాతాశిశు ఆస్పత్రి కట్టిస్తే కనీసం వైద్యులను నియమించలేదని, తాము ఆందోళన చేసే వరకు మంథని ఎమ్మెల్యేకు సోయి రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి పథకం కొనసాగించే బాధ్యత 420 హమీలు రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

