కలం, నిర్మల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బాసర మండలం బిద్రెల్లి (Bidrelli) సమీపంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అంతర్రాష్ట్ర రహదారిని కలెక్టర్ పరిశీలించారు. రహదారి ఎంతమేర దెబ్బతిన్నది, జరిగిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై అవసరమైన సూచిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రోడ్లను సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

