కలం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన (CM Revanth Reddy Foreign Tour) షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటన కొనసాగనుంది. బుధవారం రాత్రి సీఎం యూకేకు వెళ్లనున్నారు. దీనికి ముందు ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొననున్నారు.
ఈ సమావేశం అనంతరం సీఎం బుధవారం రాత్రి ఢిల్లీ నుండి లండన్ బయలుదేరనున్నారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి సీఎం కుటుంబసభ్యులతో కలిసి హాజరు కానున్నారు. ఆగస్ట్ 21న సీఎం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు. 22న కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్ బృందాలతో సీఎం సమావేశం కానున్నారు. ఆగస్ట్ 23న లండన్ నుంచి బోస్టన్‌కు వెళ్లనున్నారు. సీఎం కుటుంబసభ్యులతో పాటు ఆగస్ట్ 24 వరకు లండన్‌లోనే ఉండనున్నారు.
అనంతరం ఆగస్ట్ 24న రాత్రికి సీఎం లండన్ నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలో ఆగస్ట్ 25న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జినీయా టెక్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఆగస్ట్ 26న న్యూయార్క్‌లో జరుగనున్న కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. ఆగస్ట్ 29న న్యూ యార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్ట్ 30న సీఎం హైదరాబాద్ చేరుకుంటారు.

