కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య (28) ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్‌గా ఖమ్మంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవలే ఇంటికి వచ్చిన సంధ్య.. సోమవారం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె విగతజీవిగా కనిపించడాన్ని గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి..
డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు సంధ్య (28) చదువులో చురుగ్గా ఉండేవారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో కొంతకాలం పనిచేశారు. అనంతరం గ్రూప్–2 నోటిఫికేషన్ రాగా.. కష్టపడి చదివి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ఎంతో ప్రతిభ ఉన్న తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనుమానం కలుగుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

