కలం, మెదక్ బ్యూరో: తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే(Sangareddy MLA) చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అనేక మంది లబ్ధిదారులు తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం కోసం ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పేద కుటుంబాలకు భరోసాగా ఉన్న ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని వారు డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.

