కలం, స్పోర్ట్స్ : 2026 పురుషుల హాకీ ప్రపంచకప్‌లో(Hockey World Cup 2026) భారత్‌కు (India) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్స్టెల్వీన్లో జరిగిన పూల్-డీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 2-4తో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగంలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ పుంజుకోవడంతో టీమిండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 13వ నిమిషంలో నికోలస్ బందురక్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ అదే స్కోరుతో వెనుకబడింది.
రెండో క్వార్టర్లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. క్వార్టర్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది. 10వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి ఇదే స్కోరు కొనసాగింది. అయితే మూడో క్వార్టర్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ వరుస దాడులతో భారత్‌పై ఒత్తిడి పెంచింది. స్టువర్ట్ రష్‌మీర్ గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. అనంతరం హెన్రీ క్రాఫ్ట్ మరో గోల్ చేయడంతో ఇంగ్లండ్ 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది.
చివరి క్వార్టర్లో భారత్ స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఇంగ్లండ్ రక్షణను ఛేదించలేకపోయింది. మ్యాచ్ 10వ నిమిషంలో బందురక్ మరోసారి గోల్ చేసి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు. చివరి వరకు భారత్ నుంచి గోల్ రాకపోవడంతో ఇంగ్లండ్ విజయం ఖరారైంది. ఈ ఓటమి ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పరాజయం. అంతకుముందు వేల్స్‌పై భారత్ 3-1తో విజయం సాధించింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో తదుపరి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఆగస్టు 19న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. తదుపరి రౌండ్‌కు నేరుగా అర్హత సాధించాలంటే భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రా అయినా భారత్‌కు ఎలిమినేషన్ ప్రమాదం ఉండగా.. పాకిస్థాన్ చేతిలో ఓడితే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. దీంతో దాయాదుల పోరు భారత్ టోర్నీ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

