ఆడబిడ్డలను మోస‌గిస్తున్న కాంగ్రెస్: మెచ్చా నాగేశ్వ‌ర రావు

​కలం, ఖమ్మం బ్యూరో: స్వరాష్ట్రంలో ఏ ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ స్థానంలో నిలబడి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆదుకున్నారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను తీవ్రంగా మోసం చేస్తోందని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao)మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా చేప‌ట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు.

​ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. 2023 ఎన్నికల సమయంలో రూ. లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆడబిడ్డలతో నమ్మబలికారన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చకపోగా, కేసీఆర్ హయాంలో అమలైన పాత పథకాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చేశారని విమర్శించారు. తులం బంగారం ఇచ్చే భారం నుంచి తప్పించుకోవడం కోసమే ఈ పథకాన్ని నిలిపివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాలకొచ్చిన కాంగ్రెస్ నాయకులను ఆడబిడ్డలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

​అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆలస్యం లేకుండా పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టు కేసు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ‘తులం బంగారం’ హామీని ఎప్పటి నుండి ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>