కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి కార్మికులను దశాబ్దాలుగా వేధిస్తున్న ‘మారుపేర్ల’ (అలియాస్) సమస్యకు మోక్షం లభించింది. బాధితులకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపడానికి యాజమాన్యం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) తెలిపారు. యాజమాన్యం స్పందించడంతో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అలియాస్ పేర్ల బాధితుల వారసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. ఎమ్మెల్యే కూనంనేని, సింగరేణి పర్సనల్ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
విజిలెన్స్ విచారణల పేరిట..
అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మికులు దొరకని రోజుల్లో ఉద్యోగాల్లో చేరిన నిరక్షరాస్యులైన కార్మికుల పేర్లలో సాంకేతిక పొరపాట్లు దొర్లాయని తెలిపారు. అప్పటి తప్పులను పట్టుకుని విజిలెన్స్ విచారణల పేరుతో ఇప్పుడు యాజమాన్యం వేధింపులకు గురిచేయడం వలనే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాక మానసిక ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జఠిలమైన సమస్యను కొలిక్కి తెచ్చేందుకు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సింగరేణి యాజమాన్యంతో జరిపిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ కమిటీ ఏర్పాటైందన్నారు.
నెల రోజుల్లో పరిష్కారం కాకపోతే..
ఈ కమిటీలో యాజమాన్యం నుంచి ముగ్గురు అధికారులు, ఏఐటీయూసీ నుంచి ఇద్దరు, ఐఎన్టీయూసీ నుంచి ఒక ప్రతినిధి.. మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారని ఎమ్మెల్యే కూనంనేని వెల్లడించారు. నెల రోజుల్లో అధ్యయనం చేసి బాధితులకు న్యాయం జరిగేలా పరిష్కార మార్గాన్ని చూపుతుందని స్పష్టం చేశారు. నెల రోజుల్లో సమస్యను తేల్చకపోతే కార్మిక వారసులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో గతంలో వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయిన కార్మికుల సమస్యలను యాజమాన్యం మానవతా దృక్పథంతో పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, యూనియన్ నాయకులు వంగ వెంకట్ పాల్గొన్నారు.

