పేకాటరాయుళ్ల జోరు.. కేసులు నమోదైనా ఆపరు!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పేకాట దందా జోరుగా నడుస్తోంది. ఏపీ,‌ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు మండలాలైన అయిజ,‌ గట్టు, కేటి దొడ్డి, వడ్డేపల్లి మండలాల్లోని తోటలు, గుట్టల మధ్య లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పేకాట కేంద్రాల నిర్వాహకులకు కొందరు పోలీసులు, నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో గట్టు, అయిజ,‌ కేటి దొడ్డి మండలాల్లో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసినా ఏమాత్రం ఆపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 40పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

అందర్ బాహర్ ఆటతో…

గట్టు, అయిజ, వడ్డేపల్లి, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లో చాలా కాలంగా పేకాట జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఆడుతున్నట్లు సమాచారం. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను అడ్డాలుగా మార్చుకుని పేకాట ఆడుతున్నారు. పేకాటలో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి, త్వరగా ముగించే ఆట ‘అందర్‌ బాహర్‌’. దీని వలన లక్షల రూపాయలు పొగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మూడు ముక్కలతో ఆడే ఆటలో ఎవరికి పెద్ద ముక్క వస్తే వారే ఆటలో గెలిచినట్లుగా భావిస్తారు. పెద్ద ముక్క వచ్చిందని భావించే వ్యక్తి పోటీగా కూడా పందెంలో అదనంగా కూడా డబ్బులు పెడతారు.

కొందరు పోలీసులే..

రోజూ దాదాపు ఒక్కో స్థావరంలో 15 నుంచి 25 మందితో పేకాట ఆడిస్తున్నారు. రూ.20 నుంచి రూ.50 లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నాయి. ఈ శిబిరాల వెనుక స్థానిక నాయకుల హస్తం ఉండడంతో పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీస్ సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తుండటం, దాడులకు ముందే పేకాట నిర్వాహకులను తప్పిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

మందు.. ఆట వద్దే ఫైనాన్షియర్లు..

పేకాట అంటేనే క్రేజీ గేమ్‌గా మారింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పేకాట కొనసాగుతోంది. ఉదయం వేళల్లో పేకాట నిర్వాహకులు రెక్కీ నిర్వహించి ఏ ప్రాంతం అయితే ఆటకు ఇబ్బంది ఉండదో, ఏ ప్రాంతంలో ఆట పెడితే పేకాటరాయుళ్లు ఎక్కువ మంది వస్తారో అక్కడ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. పేకాటాడే స్థలానికి కొద్ది దూరంలో నిర్వాహకులు ఇద్దరు నుంచి నలుగురు వ్యక్తులతో నిఘా ఉంచుతారు. పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకునేలా మందు, చికెన్‌, మటన్‌తో విందు ఏర్పాట్లు చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. పేకాడుతుండగా డబ్బులు పోయిన వారికి అక్కడే ఉండే ఫైనాన్షియర్లు అప్పులు ఇస్తుండటం గమనార్హం.

ఇటీవల జరిగిన ఘటనలు..

  • ఆగస్టు 9న అయిజ మండలం చిన్న తాండ్రపాడు శివారులో మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి‌ తీసుకుని, రూ.9,110 నగదు, ఆరు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు, కారు‌ స్వాధీనం చేసుకున్నారు.
  • ఆగస్టు 6న అయిజ పట్టణంలో ఎనిమిది మందిని అదుపులోకి‌ తీసుకుని రూ. 9,910 నగదు, 5 సెల్ ఫోన్లు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
  • ఆగస్ట్ 5న గట్టు మండలం మాచర్ల గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.23,450 నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
  • జులై 31న గట్టు మండలం బోయలగూడెం శివారులో 8 మందిని పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. రూ.44,110 నగదు, 6 ఫోన్లు, 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
  • జులై 28న వడ్డేపల్లి మండలం కోయిల్‌దిన్నె గ్రామంలో అయిదుగురిని అరెస్టు చేసి, రూ.5,400 నగదు, 4 బైకులు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
  • జులై 20న గట్టు మండలం యెల్లందొడ్డి శివారులో 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.43,932 నగదు, 14 ఫోన్లు, 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
  • జూన్‌ 25న కేటి దొడ్డి మండలం ఈర్లబండలో నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, రూ.37,000 నగదు, నాలుగు ఫోన్లు స్వాధీ‌నం చేసుకున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదు: వై.మొగులయ్య, గద్వాల డీఎస్పీ

పేకాట రాయుళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా పోలీసులు అక్కడికి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారు. పేకాట ఆడినా, వాటిని ఆడించిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>