టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ ఫైర్.. అసలు తప్పెక్కడ?

కలం, స్పోర్ట్స్​ : టీమిండియాలో వరుస గాయాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కొక్కరుగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక ప్రశ్నలు లేవనెత్తారు. గాయాలకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిజియోలనే నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు ప్రస్తుతం గాయాలతో అందుబాటులో లేరు. దీంతో టీమిండియా గాయాల నిర్వహణపై చర్చ మొదలైంది. అయితే గవాస్కర్ దృష్టి మరో అంశంపై ఉంది.

భారత ఆటగాళ్లలో ముఖ్యంగా హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలా పదే పదే గాయాలు ఎందుకు వస్తున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యను కేవలం ఫిజియోలపై నెట్టేయకూడదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ల శిక్షణ విధానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా మ్యాచ్‌ల్లో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేలా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారా అన్నదే కీలకమని పేర్కొన్నారు. బౌలర్ల ప్రాక్టీస్‌పై ఉన్న కొన్ని పరిమితులపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

బయోమెకానిక్స్, వర్క్‌లోడ్ పేరుతో నెట్స్‌లో బౌలింగ్‌ను ఎక్కువగా పరిమితం చేయడం ఎంతవరకు ఉపయోగకరమని సందేహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌లో ఎక్కువ బంతులు వేయాల్సి ఉండగా.. ప్రాక్టీస్‌లో మాత్రం చాలా తక్కువ బంతులు వేయించడం వల్ల అసలు మ్యాచ్ పరిస్థితులకు ఎలా సిద్ధమవుతారని గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశ్నించారు. ఫిట్‌నెస్ విషయంలో జిమ్‌లో బలంగా ఉండటం కంటే.. మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉండటమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

వరుసగా గాయాలు వస్తున్నందున మొత్తం విధానాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా గాయాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. వరుస గాయాల కారణంగా తుది జట్టులో తరచూ మార్పులు చేయాల్సి వస్తోందని చెప్పాడు. ముందున్న ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిది నుంచి పది మ్యాచ్‌లు ఆడాల్సి రావచ్చని గిల్ పేర్కొన్నాడు.

ఇప్పుడు రెండు, మూడు మ్యాచ్‌లకే ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కష్టంగా ఉంటే.. అంత పెద్ద టోర్నీలో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తాడు. దీంతో టీమిండియా గాయాల సమస్యపై చర్చ మరింత పెరిగింది. గవాస్కర్ వ్యాఖ్యలు మాత్రం ఈ చర్చను మరో దిశలోకి తీసుకెళ్లాయి. ఫిజియోల పనితీరుతో పాటు ఆటగాళ్ల శిక్షణ, ఫిట్‌నెస్, మ్యాచ్‌కు సిద్ధమయ్యే విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అంశం ఇప్పుడు ముందుకు వచ్చింది.

Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>