కలం, వెబ్‌డెస్క్: స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్, ఫిఫా వరల్డ్ కప్ హీరో ఫెర్రాన్ టోర్రెస్ (Ferran Torres) ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్లో చేరారు. ఈ ఫ్రెంచ్ క్లబ్‌తో ఆయన 2031 వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పిఎస్జిలో ఆయన నంబర్ 9 జెర్సీని ధరించనున్నారు. బార్సిలోనాలో విజయవంతమైన కెరీర్ తర్వాత టోర్రెస్ ఈ కొత్త లీగ్‌లోకి అడుగుపెడుతున్నారు. 2000 ఫిబ్రవరి 29న స్పెయిన్‌లోని ఫోయోస్లో టోర్రెస్ జన్మించారు. చిన్నతనంలో ఫుట్సాల్తో ఆట మొదలుపెట్టి, ఏడేళ్ల వయసులో వాలెన్సియా అకాడమీలో చేరారు.
డిసెంబర్ 2017లో వాలెన్సియా తరఫున లా లిగాలో అడుగుపెట్టారు. 21వ శతాబ్దంలో పుట్టి లా లిగా మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. వాలెన్సియాలో మూడేళ్లు ఉండి 97 మ్యాచులు ఆడారు. ఆ జట్టుతో 2019లో కోపా డెల్ రే కప్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2020లో మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు మారారు. పెప్ గ్వార్డియోలా శిక్షణలో 43 మ్యాచులు ఆడి, 16 గోల్స్ చేశారు. అక్కడ ప్రీమియర్ లీగ్, లీగ్ కప్ టైటిళ్లను ముద్దాడారు.
అనంతరం 2021-22 సీజన్లో బార్సిలోనా క్లబ్‌కు మారారు. బార్సిలోనా తరఫున 207 మ్యాచుల్లో 65 గోల్స్ సాధించారు. ఈ సమయంలో బార్సిలోనా మూడు లా లిగా టైటిళ్లు, ఒక కోపా డెల్ రే, రెండు స్పానిష్ సూపర్కప్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో టోర్రెస్ స్పెయిన్ జాతీయ జట్టు తరఫున 65 మ్యాచులు ఆడారు. లూయిస్ ఎన్రిక్ కోచింగ్‌లో 2020లో సీనియర్ జట్టులోకి వచ్చారు. యూరో 2020, 2022 వరల్డ్ కప్‌లలో ఆడారు.
స్పెయిన్ జట్టు 2023 నేషన్స్ లీగ్, 2024 యూరో కప్ గెలవడంలో తోడ్పడ్డారు. ఇటీవల జరిగిన 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనాపై ఏకైక విన్నింగ్ గోల్ కొట్టి స్పెయిన్‌కు ప్రపంచకప్ అందించారు. ఇప్పుడు పిఎస్జి క్లబ్లో మేనేజర్ లూయిస్ ఎన్రిక్ పర్యవేక్షణలోనే ఆడేందుకు సిద్ధమయ్యారు. పిఎస్జి వంటి ప్రతిష్టాత్మక క్లబ్లో చేరడం ఆనందంగా ఉందని టోర్రెస్ తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, క్లబ్‌కు మరిన్ని ట్రోఫీలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

