కలం, సూర్యాపేట: తొమ్మిది జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. తమ హయాంలోనే దేవాదుల నాలుగో దశ పనులను పూర్తి చేసి, తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకొస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
5 లక్షల ఎకరాల ఆయకట్టుకు..
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని 5.82 లక్షల ఎకరాల ఆయకట్టును పరిరక్షించి, స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.2,392 కోట్లతో మహాత్మాగాంధీ ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్, జంపాడు బ్రాంచ్ కెనాల్, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. వీటి ద్వారా 77 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని చెప్పారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ అభివృద్ధికి రూ.396 కోట్లు, మూసీ కాలువల ఆధునీకరణకు రూ.70 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రైతులకు సన్న బియ్యానికి రూ.118 కోట్లు బోనస్ ఇచ్చామని, ప్రస్తుత వానాకాలం రైతు భరోసా కింద 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.364 కోట్లు జమచేశామని తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ తదితర అధికారులు పాల్గొన్నారు.

