కలం, ఖమ్మం బ్యూరో: సీతారామ ప్రాజెక్టు (Sitarama Project Works) డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇకపై ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పంపును ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
భూసేకరణను వేగవంతం చేయాలి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు అప్పగించిన వెంటనే రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులు భూమి పైభాగంలో యథావిధిగా వ్యవసాయం చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అదనంగా సీతారామ ద్వారా కొత్తగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కొద్దిమంది వల్ల వేలాది మంది రైతులకు మేలు చేసే ప్రాజెక్టు పనులు నిలిచిపోకూడదని పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోగా నీళ్లు విడుదల చేయాలి..
ఈ నెలాఖరులోగా ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలని, గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆగస్టు నుంచే ఆరుతడి పంటలకు నీరందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, తుమ్మల చెరువు నిండడం వల్ల ప్రాంతీయంగా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రి, అక్కడ పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భూసేకరణను పూర్తి చేసి ప్రాజెక్టును సత్వరమే రైతుల చేతుల మీదుగానే ప్రారంభించేలా పనులు ముమ్మరం చేయాలని అధికారులకు తేల్చిచెప్పారు.

