కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ఎందుకు ముద్రించలేదని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ (Ramar Rao Patel) ప్రశ్నించారు. శనివారం నిర్మల్ పట్టణ శివారులోని సాగర్ కన్వెన్షన్ హాల్ లో జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంతో లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్మార్ట్ కార్డులపై (Smart Ration Cards) ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలకు సంబంధించిన కార్డుల్లో ప్రధాని చిత్రాన్ని ముద్రించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. ఎమ్మెల్యే పవర్ రామారావు వ్యాఖ్యలకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం అందించేదని కానీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి లబ్ధిదారునికి సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.

