కలం, కరీంనగర్ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (Peddapalli MP) పరిశీలించారు. స్టేషన్‌లోని అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి వరుసగా తీసుకెళ్తున్నామని తెలిపారు. రైల్వే బోర్డు అధికారులను కలిసి రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నామని, పనులు వేగవంతంగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న రైల్వే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కనీస సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం జరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు హాజరైన తీరుపై ఎంపీ విమర్శలు చేశారు. సుమారు 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పటికీ ఒక్కరోజు కూడా పార్లమెంట్‌కు హాజరుకాకపోవడం ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వందేమాతరం బిల్లుకు సంబంధించిన సమయంలో మాత్రమే పార్లమెంట్‌కు వచ్చి వెళ్లారని, ప్రజా సమస్యలపై ఆయన వైఖరిని దేశ ప్రజలు, యువత గమనిస్తున్నారని అన్నారు.
అమిత్ షా వ్యవహారశైలి కారణంగా సుమారు రూ.250 కోట్ల ప్రజాధనం వృథా అయిన పరిస్థితి ఏర్పడిందని ఎంపీ ఆరోపించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “కేటీఆర్‌కు లెక్కలు రావేమో.. 8+8=0 అని అంటున్నారు. గత పది సంవత్సరాల్లో 10 మంది ఎంపీలతో పెద్దపల్లి పార్లమెంట్‌కు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి” అని ప్రశ్నించారు.
గత పదేళ్లలో పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ ఎంపీలు పట్టించుకోలేదని విమర్శించిన ఎంపీ వంశీకృష్ణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

