స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో మెరుగైన సేవలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: స్మార్ట్ రేషన్ కార్డులతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. శనివారం వనపర్తి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్మార్ట్‌ డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 1,83,013 స్మార్ట్‌ డిజిటల్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇందులో అర్హులైన కుటుంబాలకు కొత్తగా 26,465 రేషన్‌ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నామని వివరించారు.

5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..

వనపర్తి నియోజకవర్గంలో గుడిసెలు కనిపించకుండా చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు అందించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి పని చేస్తోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి పేదలకు అండగా నిలిచిందన్నారు.

రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు..

వనపర్తి నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. పట్టణంతో పాటు పెబ్బేరు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. వనపర్తిలో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, ఐటీ టవర్‌, ఇందిరా మహిళా శక్తి భవనం వంటి కీలక ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదివిన పాఠశాల, కళాశాల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. వనపర్తిలో నూతన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, పౌరసరఫరాల డీఎం ఆంజనేయులు, వనపర్తి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ మాధవి, వైస్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, పెబ్బేరు మార్కెట్‌ యార్డు ఛైర్‌పర్సన్ ప్రమోదిని, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>