కలం, తుర్కపల్లి : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఉత్సాహంగా జరుపుకుంటుంటే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి (Turkapally Mandal) లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా బ్యాంకు అధికారులు విధులకు పూర్తిగా గైర్హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం బ్యాంకు కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది.
అయితే, సంబంధిత అధికారులు, సిబ్బంది ఎవరూ హాజరుకాకపోవడంతో జెండా ఆవిష్కరణ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులో పనిచేస్తున్న అటెండర్తోనే జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. దేశభక్తిని చాటాల్సిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా విధులకు హాజరుకాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సైతం తక్కువ చేసి చూసిన బాధ్యులైన బ్యాంక్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

