ఆకలి లేని తెలంగాణే లక్ష్యం.. డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన భట్టి

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)లను ఆయన స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం కేవలం పాలకుల ప్రయోజనాలు లేదా అధికారాన్ని చెలాయించడం కోసం కాకుండా, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని తెలిపారు. ​దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లేలా ప్రభుత్వం బలమైన పునాదులు వేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే మహోన్నత జాతీయ పండుగ అని, మనకు రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. పేదరికంపై సమరభేరి మోగిస్తూ దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రస్తుతం కోటి 6 లక్షల 28 వేల 92 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని, వీరందరికీ అంటే దాదాపు 3 కోట్ల 42 లక్షల 57 వేల 109 మందికి నెలకు మనిషికి 6 కేజీల చొప్పున ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తోందని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.55 వరకు ఉండే ఈ బియ్యం ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖకు చెల్లిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త కార్డులు మంజూరు చేసిందని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే కొత్తగా 62,158 కార్డులను అందించామని గుర్తుచేశారు.

​వైద్యం కోసం పేదలు ఆస్తులు, తాళిబొట్లు అమ్ముకునే దుస్థితిని తుడిచిపెట్టేందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని, ఇప్పుడు పేదలు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన చికిత్స పొందుతున్నారని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి, వారి తరఫున ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.10,700 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలనలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>