కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వసారి ఎర్రకోటపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించనున్నాయి. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు 5 వేల మందికి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరించేముందు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు ఆర్పించారు.
కాగా ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఎర్రకోట వేడుకల్లో తొలిసారిగా జాతీయ గీతానికి ముందు ‘వందే మాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎర్రకోట పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

