జెమీమా ఔట్.. ఆసియా కప్‌కు ప్రతికా

కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) గాయం కారణంగా మహిళల ఆసియా కప్‌కు దూరమైంది. అంతేకాకుండా జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలలోనూ ఆమె ఆడే అవకాశం లేదు. ఆగస్టు 3న ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో సదర్న్ బ్రేవ్ తరఫున ఆడుతున్న సమయంలో జెమీమా రోడ్రిగ్స్ కుడి హ్యామ్‌స్ట్రింగ్‌కు గాయమైంది. దీంతో ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. అనంతరం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బీసీసీఐ వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. పరీక్షలలో జెమీమా కుడి హ్యామ్‌స్ట్రింగ్‌లో తీవ్ర స్థాయి చీలిక ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో యూఏఈలో జరగనున్న మహిళల ఆసియా కప్‌తో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

జెమీమా స్థానంలో ప్రతికా రౌల్

జెమీమా స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రతికా రౌల్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే వన్డేల్లో మంచి అనుభవం ఉంది. 27 వన్డేల్లో 1,189 పరుగులు సాధించింది. 2025 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టులోనూ ప్రతికా రౌల్ సభ్యురాలిగా ఉంది. దీంతో ఆసియా కప్‌లో ఆమెపై జట్టు మేనేజ్‌మెంట్ భారీగా ఆశలు పెట్టుకుంది.

ఆగస్టు 30న తొలి మ్యాచ్

మహిళల ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 3న హాంకాంగ్-చైనాతో తలపడనుంది. సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి టైటిల్ సాధించేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగుతోంది. జెమీమా వంటి కీలక బ్యాటర్ దూరం కావడం భారత జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ.. ఆమె స్థానంలో వచ్చిన ప్రతికా రౌల్ తనకు లభించిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>