కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ పడేది లేదని, పెండింగ్ కేసుల పరిష్కారం, సైబర్ నేరాల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ వర్చువల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ ఆదేశించారు.
దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, భరోసా కేంద్రాలు, షీ-టీమ్స్ ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచి, హాట్స్పాట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే సైబర్ మోసాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, ఫిర్యాదులు రాగానే వేగంగా స్పందించాలని కోరారు. సీసీటీఎన్ఎస్ 2.0, నాట్‌గ్రిడ్, సీసీటీవీ కమాండ్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. పోక్సో, ఎస్సీ/ఎస్టీ, మిస్సింగ్ కేసులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, డయల్-100 పిలుపులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌పై నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు.
ఈ వర్చువల్ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు, భద్రాచలం డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, అరుణ్ కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామితో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

