కన్ను పడితే ఖతమే.. ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: రాత్రివేళల్లో నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా క్షణాల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు. ఏకంగా 83 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రధాన సూత్రధారితో సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.26 లక్షల విలువైన 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ సంచలన చోరీల ముఠా గుట్టును రట్టు చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో

​తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ముఠాకు అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెంకు చెందిన నాగేంద్రబాబు (35) ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 83 దొంగతనం కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతనితోపాటు ముఠాలోని ఇతర సభ్యులైన వల్లూరి శాంతరాజు (11 కేసులు), ఊర లింగయ్య (12 కేసులు), ఉకే భద్రం, బెత్తి కార్తిక్, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మలను పోలీసులు (Bhadradri Kothagudem Police) అరెస్ట్ చేశారు. కాగా, ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన 50 సంవత్సరాల అంతర్రాష్ట్ర నేరస్తుడు తమ్మిశెట్టి బాలవీరస్వామి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.

మహిళలనే లక్ష్యంగా

​ఈ ముఠా నేరాల తీరు చాకచక్యంగా సాగేది. రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రించే మహిళలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేవారు. ఆ తర్వాత మహిళల మెడలోని బంగారు గొలుసులను ఎలక్ట్రిక్ వైర్ కట్టర్లతో క్షణాల్లో కట్ చేసి, బైక్‌లపై అక్కడి నుంచి పరారయ్యేవారు. చోరీ చేసిన ఆభరణాలను నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా, ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టేవారని దర్యాప్తులో స్పష్టమైంది.

​ఈ ఆపరేషన్‌తో దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 10 వరుస చైన్ స్నాచింగ్, బైక్ చోరీ కేసులకు పరిష్కారం లభించింది. కేసులను సమర్థవంతంగా ఛేదించిన పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రాజేశ్ కుమార్, యయాతి రాజు, ఇతర సిబ్బందినీ ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. ఇదే మొదటిసారి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>