కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో ‘అఖండ భారత సంకల్ప దివస్’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, భరతమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివస్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం చీకటి రోజు అని పేర్కొన్నారు. దేశ విభజనతో ఏర్పడిన గాయాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్‌లో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచి విశ్వగురువుగా అవతరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

