కలం, ఢిల్లీ బ్యూరో: ‘ఓటుకు నోటు’ కేసును (Cash for Vote Case) మళ్లీ మొదటి నుంచీ విచారించాల్సిందేనని, అన్ని వైపుల నుంచి వాదనలు కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన జడ్జీలు రిటైర్ అయ్యారని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొన్నది. విచారణ తుది దశలో ఉన్నప్పుడే జడ్జీలు పదవీ విరమణ చేశారని వ్యాఖ్యానించింది. ‘పార్ట్ హెడ్ మ్యాటర్’గా సీజే ధర్మాసనం ముందుకు విచారణకు పిటిషన్లు వచ్చిన సందర్భంగా పై అంశాలను వెల్లడించింది. సమగ్రమైన విచారణ జరగాలంటే మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడమే సమంజసమని పేర్కొన్నది.
ఏసీబీతో విచారణ వద్దంటూ రేవంత్ పిటిషన్
ఈ కేసు ఏసీబీ పరిధిలో ఉన్నందున ట్రయల్ కోర్టు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో కొట్టివేసింది. ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన అంశాన్ని ఏసీబీతో విచారణ చేయించడం సమంజసం కాదని ఈ కేసుల నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సండ్ర వెంకట వీరయ్య సైతం ఇదే తరహా పిటిషన్ వేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశారు.
మొదటి నుంచి విచారణ
‘పార్ట్ హెడ్ మ్యాటర్’ అంటూ బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ల గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి గురువారం వివరించారు. దీంతో కొత్త కేసుగానే పరిగణనలోకి తీసుకుని ప్రారంభం నుంచీ విచారణ చేపడతామని, అన్ని వైపుల వాదనలను మరోసారి వింటామని, విచారణ ప్రక్రియ మొత్తం మొదటి నుంచీ జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా వాయిదా వేసింది.

