కార్పొరేట్‌ ఒత్తిడికి తలొగ్గుతున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కలం, నేషనల్ డెస్క్: అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు(శాచురేటెడ్‌ ఫ్యాట్‌) ఉండే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమైన హెచ్చరిక లేబుళ్లు (ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాక్‌ వార్నింగ్‌ లేబుల్స్‌) ముద్రించాల్సిందేనని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్పొరేట్‌ కంపెనీల ఒత్తిళ్లకు లొంగి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా? అని నిలదీసింది.

లేబుళ్లు ఏర్పాటు చేసే విషయంపై రెండు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రజల, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొంది. కేరళకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

పిటిషన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారించినప్పుడే హెచ్చరిక లేబుళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పందిస్తూ హెచ్చరిక లేబుళ్లకు బదులుగా మొత్తం పోషక విలువను సులభంగా తెలియజేసే స్టార్‌ రేటింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. లేబుళ్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ఆహార పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన వాదనల్లో వినిపించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు ఎలాంటి కార్పొరేట్‌ ఒత్తిళ్లకు లోనుకాకుండా తీసుకోవాలని సూచించింది. లేబుల్ మీద హెచ్చరికలు ఉంచడం అంటే అమ్మకాలను ఆపడం కాదని, తాము ఏమి తింటున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజెప్పడమేనని తేల్చి చెప్పింది.

పిండివంటలపై కూడా లేబుల్స్‌!

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భారతదేశంలో చాలామందికి పోషకాహారంపై పెద్దగా అవగాహన లేదని, గ్రాముల లెక్కలు చూసి కొనుగోలుదారులు లెక్కలేసుకోలేరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కలర్-కోడింగ్ , లేకుంటే స్పష్టమైన హెచ్చరిక చిహ్నాలు మాత్రమే వినియోగదారుడికి సులువుగా అర్థమవుతాయని వివరించారు. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. హెచ్చరిక లేబుళ్లు ప్రవేశపెడితే గుడ్లు, సంప్రదాయ భారతీయ పిండివంటలు/స్నాక్స్ (ఉదాహరణకు న్యామ్‌కీన్ వంటివి)పై కూడా ఎరుపు రంగు హెచ్చరిక మార్కులు పడతాయని, విదేశీ ప్రమాణాలను ఇక్కడ నేరుగా అమలు చేయడం కష్టమని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు ‘‘భారత్‌ అభివృద్ధి చెందని దేశంగానే ఉండిపోవాలా? మన దేశంలో ఎంతమంది పిల్లలు జీడిపప్పు, బాదం పప్పులు కొనుక్కోగలరు? ఎంతమంది కుర్‌కురే కొంటున్నారు? మేము ఏ ప్రాడక్ట్‌కు వ్యతిరేకం కాదు, వినియోగదారుడు తాను ఏం తింటున్నాడో ముందుగానే తెలుసుకునే హక్కు ఉందనేదే మా ఉద్దేశం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>