కలం, వెబ్ డెస్క్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక సమావేశం జరగనుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు పాలనరమైన, సంక్షేమ పరమైన కీలక అంశాలతో పాటు నూతన ప్రాజెక్టులపై మంత్రి మండలి చర్చించి ఆమోదం తెలపనుంది.
ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనుకు భూములు ఇచ్చే రైతులకు ఊరట కలిగించేలా కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంపై మంత్రి మండలి చర్చించనుంది. ఈ విధానం ప్రకారం .. భూమి ఇచ్చిన యజమానులకు అభివృద్ధి చేసిన ప్లాట్లలో 60 శాతం తిరిగి కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఈ సమావేశంలో మెట్రో విస్తరణ, హిల్ట్ పాలసీపై చర్చించే అవకాశం ఉంది.

