కలం, స్పోర్ట్స్: శ్రీలంక క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. లంక వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ మాజీ కోచ్, 62 ఏళ్ల సుమిత్ ఫెర్నాండో (Sumith Fernando) దారుణంగా హత్యకు గురయ్యారు. కొలంబోలోని క్రికెట్ మైదానంలో ఆటగాళ్లతో జరిగిన ఘర్షణలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల స్కూల్ క్రికెటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఆగస్టు 8న జరిగింది. సీడువ ప్రాంతానికి చెందిన కొందరు యువ క్రికెటర్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు మంచినీళ్లు తాగడానికి కుళాయి దగ్గరకు వెళ్లగా, అందులో నీళ్లు లేవు. దీంతో ఆటగాళ్లకు, క్లబ్ సిబ్బందికి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో సిబ్బంది ఒక ఆటగాడిపై దాడికి యత్నించగా, గొడవ మరింత పెద్దదైంది. ఈ గొడవలోనే సుమిత్ ఫెర్నాండో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫెర్నాండోను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్నుమూశారు. దాడికి పాల్పడిన 17 ఏళ్ల యువకుడిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొలంబో కోర్టులో హాజరుపరచగా, నిందితుడిని ఆగస్టు 17 వరకు చైల్డ్ ప్రొబేషన్ కస్టడీకి పంపారు.
గురువారం రోజున ఫెర్నాండో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుమిత్ ఫెర్నాండో గతంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాల కోచ్‌గా పనిచేశారు. కుశాల్ మెండిస్‌తో పాటు ఎంతో మంది లంక క్రికెటర్లను ఆయన తీర్చిదిద్దారు. ఆ తర్వాత బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్లో క్యూరేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ ఘటన క్రీడా లోకంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

