కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో అక్రమ వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై దుర్మరణం పాలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) బానోత్ నవీన్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్ పాయం వెంకటేశ్వర్లును కలిశారు. అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన నవీన్, వేటగాళ్లు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు బలయ్యాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అమరుడైన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తగిన ఆర్థిక సహాయంతోపాటు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కోరారు.
అడవుల్లో విద్యుత్ ఉచ్చులు వేస్తూ, అటవీ సిబ్బంది, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వేటగాళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ సభ్యులు టి. శోభన్, పి. ఎర్రయ్య, జి. బాబురావు, బి. వెంకన్న, నరేష్, హతిరామ్, శరన్, మదన్ లాల్ పాల్గొన్నారు.

