కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah)కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన అభివృద్ధికి నీరాజనం పలుకుతూ ఓ ఆదివాసీ గూడెం ప్రజలు తమ గూడేనికి కలెక్టర్ పేరు పెట్టుకొని కృతజ్ఞతను చాటుకున్నారు. స్వయంగా కలెక్టర్ చేతుల మీదుగానే గూడెం బోర్డును ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. పిప్పల్దరి పంచాయతీలోని దహి గూడ మారుమూల ప్రాంతం. ఈ గూడెంలో కోలామ్ ఆదివాసీ బిడ్డలు నివసిస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షా పలు అభివృద్ధి కార్యక్రమాలతో గూడెం దశను మార్చేశారు. అందుకే ఆదివాసీ బిడ్డలు గూడేనికి రాజర్షిషా గూడగా నామకరణం చేశారు.
ఒకప్పుడు ఇది పూర్తిగా గుడిసెల గూడెం. పూరి గుడిసెల్లో నివసిస్తున్న గిరిజనులకు కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. తాగు నీటి వసతి కల్పించారు. అలాగే గూడెంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. కలెక్టర్ దశల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులతో దహి గూడ రూపురేఖలే మారిపోయాయి. గతంలో ఎంతో నిర్లక్ష్యానికి గురైన తమ గూడేనికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి చేసిన కలెక్టర్కు ఆదివాసీలు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపారు. తమ గూడెం పేరు మారుస్తూ రాజర్షి షా గూడ పేరుతో కొత్త బోర్డు ఏర్పాటు చేశారు.
కలెక్టర్ రాజర్షి షా గురువారం గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా తన పేరుతో గూడెం వాసులు ఏర్పాటు చేసిన బోర్డును ప్రారంభించారు. తనపై అక్కడి ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలకు కలెక్టర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకొని ఇండ్లు నిర్మించుకున్న ఆదివాసీలను అభినందించారు.
గూడెంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. చదువుకున్న యవతకు ఉద్యోగాలు ఇవ్వడానికి శిక్షణ ఇస్తామన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని గిరిజనులకు సూచించారు.

