బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త: నల్లగొండలో జేబుదొంగల ముఠా !

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) ఆర్‌టీసీ బస్ స్టాండ్‌లో ప్రయాణికుల్లా నటిస్తూ పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్లగొండ టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ఆటోరిక్షా, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సిరిగిరి కవిత, బొంతల నాగమణి అక్కాచెల్లెళ్లు కాగా, నాగమణి భర్త వాంకుడోత్ ప్రసాద్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు బస్ స్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ ఆర్‌టీసీ బస్సులు ఎక్కేవారు.

ఆ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల జేబులు, సంచుల్లోని సెల్‌ఫోన్లు, నగదును దొంగిలించడం వీరి నైజం. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన నల్లగొండ బస్ స్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ముగ్గురు మహిళల నుంచి రెండు ఫోన్లు, రూ.3,800 నగదు కాజేశారు. మరసటి రోజు ఉదయం మళ్లీ అదే బస్ స్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్టయిన ముఠాపై గతంలో పటాన్‌చెరువు, జీడిమెట్ల, ఎల్.బి.నగర్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లలో సుమారు 16 దొంగతనం కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. గతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినా, వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా మళ్లీ దొంగతనాల బాట పట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>