కలం, కరీంనగర్ బ్యూరో : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో పోలీసుల పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ అల్మాస్‌గూడలో నివసిస్తున్న కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన కట్కూరి శరత్ కుమార్ (31)లు గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సేకరించేవారు. అనంతరం ఆ కేంద్రాల నిర్వాహకులకు ఫోన్ చేసి, తాము చందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అని పరిచయం చేసుకునేవారు. అత్యవసరంగా హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు కావాలంటూ నమ్మించేవారు.
ముందుగానే ఒక పెట్రోల్ బంక్ సిబ్బంది వద్దకు వెళ్లి, తమ వాహనం రిపేర్‌కు వచ్చిందని, సార్ డబ్బులు మీ నంబర్‌కు పంపిస్తారని చెప్పి వారి ఫోన్‌పే నంబర్ తీసుకునేవారు. ఆ నంబర్‌ను మీసేవ నిర్వాహకులకు ఇచ్చి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకుని, ఆపై పెట్రోల్ బంక్ వద్ద నగదును తీసుకుని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేవారు.
ఇందులో భాగంగా చందుర్తికి చెందిన చిలుక పెంటయ్యకు ఫోన్ చేసి, తన బాబు ఆరోగ్యం బాగులేక హాస్పిటల్‌లో చేర్పించామని చెప్పి రూ.70,000 ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన పెంటయ్య చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.18,000 నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కి పైగా కేసులు ఉండగా, బాధితుల నుండి సుమారు రూ.15 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఇతర సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

