భవిత కేంద్రాలకు ప్రత్యేక వసతులు.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

కలం, కరీంనగర్​ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra).. ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధన్గర్ వాడీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. భవిత కేంద్రంలో గదులు కలియ తిరుగుతూ రిజిస్టర్ పరిశీలించారు. పిల్లలు, సిబ్బంది వివరాలు, చిన్నారులకు అందిస్తున్న ఫుడ్ వివరాలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. జిల్లాలోని 16 భవిత కేంద్రాల్లో తాగునీరు (వాటర్ డిస్పెన్సరీలు) ఏర్పాటు చేయాలన్నారు.

ఇక్కడి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సైతం యూనిఫామ్, పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రంలో పేరెంట్స్ వెయిటింగ్ రూమ్, ప్రత్యేక వాష్ రూమ్, ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక ప్లేట్లు, గ్లాసులు అందించాలన్నారు. ప్రతి భవిత కేంద్రంలో సరిపడా సిబ్బంది (సమ్మిళిత విద్యా బోధకులు) ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి గదులు పరిశీలించారు. అందిస్తున్న సౌకర్యాలు తెలుసుకున్నారు.

పాఠశాలలో వృధాగా ఫర్నీచర్, బెంచీలు ఉండటంపై అసహన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్, బెంచీలను అవసరమైన పాఠశాలలకు తరలించాలని ఆదేశించారు. పిల్లలు కింద కూర్చోకుండా విధిగా బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. స్క్రాప్ ను తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉన్న వనరులను వృధాగా ఉంచకుండా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శన

ఆ తర్వాత డాక్టర్ స్ట్రీట్ లో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ (Collector Chitra Mishra) విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. స్కూల్ భవనం శిథిలావస్థకు చేరినందున.. మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అప్పటివరకు తాత్కాలికంగా ముకరంపురలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లోకి ఈ స్కూల్ ను తరలించాలని సూచించారు.

విద్యార్థులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హై స్కూల్ తరగతి గదులు శిథిలావస్థకు చేరినందున తొలగించి.. పెద్ద భవనం నిర్మించాలన్నారు. భవనం చుట్టూ ప్రహరీ, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. స్మార్ట్ సిటీ కింద ఏ పాఠశాలల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

Also Read : తెలంగాణ ఎవ‌ని పాలైందిరో అనిపిస్తోంది: రాజ‌గోపాల్‌రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>